🏠 www.aryadvi.com
Watermark
Newspaper Logo
www.aryadvi.com | Date: 24 Aug, 2026 | Page: 1

జూరెల్ అద్భుత సెంచరీ.. 503/9 వద్ద భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. వికెట్‌కీపర్ బ్యాటర్ ధ్రువ్ జూరెల్ (115 నాటౌట్) అద్భుత సెంచరీతో రాణించడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 138 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (117) కూడా శతకంతో మెరవడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.

రెండో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించిన సమయంలో జూరెల్ 95 పరుగులతో ఉన్నాడు. ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత ఆచితూచి బ్యాటింగ్ చేసిన అతడు.. అసిత్ ఫెర్నాండో బౌలింగ్‌లో బౌలర్ మీదుగా చక్కటి డ్రైవ్ ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శతకం అనంతరం చేతిపై ఉన్న ‘జై జవాన్, జై కిసాన్’ టాటూను చూపిస్తూ అభివాదం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సెంచరీ పూర్తయ్యాక జూరెల్ మరింత దూకుడుగా ఆడాడు. ఫెర్నాండో బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. ప్రసిద్ధ్ కృష్ణతో కలిసి భారత్ స్కోరును 500 పరుగుల మార్కు దాటించాడు. అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించాడు.

ఈ ఇన్నింగ్స్‌లో జూరెల్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. రిషభ్ పంత్ (63)తో కలిసి 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. శ్రీలంక బౌలర్లలో అసిత్ ఫెర్నాండో 4 వికెట్లు పడగొట్టగా, ప్రభాత్ జయసూర్య, కేశార నువంత చెరో 2 వికెట్లు తీసుకున్నారు.

భారత్ 503/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో శ్రీలంక రెండో రోజు ఆట ముగిసేలోపు తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుంది.
🏠 Home