🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 31 August 2026, 6:20 pm Posted by : ARYADVI NEWS

వెలిగొండపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. వైసీపీపై తీవ్ర విమర్శలు

News Image

మూడు దశాబ్దాల కల సాకారం.. వెలిగొండ తొలి దశ ప్రారంభం

ప్రకాశం జిల్లా ప్రజల మూడు దశాబ్దాల కలను సాకారం చేస్తూ సీఎం చంద్రబాబు సోమవారం వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను జాతికి అంకితం చేశారు. నల్లమల సాగర్‌లోకి కృష్ణా జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు భావోద్వేగంగా మాట్లాడారు.

1996 మార్చి 5న తానే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని, 30 ఏళ్ల తర్వాత మళ్లీ ముఖ్యమంత్రిగా 2026 ఆగస్టు 31న ప్రాజెక్టును ప్రారంభించడం తన అదృష్టమని చంద్రబాబు అన్నారు. మాట ఇచ్చి నిలబెట్టుకున్నానని పేర్కొన్నారు.

గత ప్రభుత్వంపై ఫైర్

వైసీపీ ప్రభుత్వ హయాంలో వెలిగొండ ప్రాజెక్టుకు గ్రహణం పట్టిందని చంద్రబాబు విమర్శించారు. గత ప్రభుత్వం కేవలం 2.77 శాతం పనులు చేసి, ఎన్నికలకు ముందు ప్రాజెక్టును జాతికి అంకితం చేశామని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. “పనులు పూర్తికాకుండానే జాతికి అంకితం చేశామని డ్రామా ఆడారు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తన ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుకు 50 శాతానికి పైగా నిధులు ఖర్చు చేశామని, టన్నెల్ బోరింగ్ మిషన్‌ను తొలగించేందుకు స్వయంగా రంగంలోకి దిగానని చంద్రబాబు తెలిపారు.

లక్షల ఎకరాలకు సాగునీరు

ప్రస్తుతం 10.7 టీఎంసీల నీటిని నల్లమల సాగర్‌కు తీసుకొస్తున్నామని సీఎం చెప్పారు. తొలి దశలో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుందని వివరించారు.

ప్రాజెక్టు పూర్తిగా పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని తెలిపారు.

నిర్వాసితులకు హామీలు

వెలిగొండ కోసం భూములు, ఇళ్లు, గ్రామాలను త్యాగం చేసిన 11 గ్రామాల నిర్వాసితులకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే రూ.768 కోట్లు చెల్లించామని, మిగిలిన నిధులను కూడా త్వరలో అందిస్తామని హామీ ఇచ్చారు. కటాఫ్ డేట్ కారణంగా నష్టపోయిన వారికి అదనంగా రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు.

2028 నాటికి రెండో దశ పూర్తి

2028 నాటికి వెలిగొండ ప్రాజెక్టు రెండో దశను పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రాబోయే మూడేళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. దేశంలో నీటి సమస్యకు నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కారమని, గోదావరి-కావేరి అనుసంధానంపై కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

🏠 Home