🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 31 August 2026, 6:28 pm Posted by : ARYADVI NEWS

పెట్రోల్‌లో ఇథనాల్ ఎంత?.. కీలక పిల్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం

News Image

ఇంధన వివరాలు బంకులు, రశీదులపై ముద్రించాలన్న డిమాండ్‌కు నో

న్యూఢిల్లీ: పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ పరిమాణాన్ని వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిల్‌ను విచారించేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ అంశంపై పిటిషనర్ సంబంధిత హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది.

న్యాయవాది ఎన్.కె. గోస్వామి దాఖలు చేసిన పిటిషన్‌లో పెట్రోల్ నాజిళ్లతో పాటు వినియోగదారులకు ఇచ్చే రశీదులపై ఇథనాల్ శాతాన్ని తప్పనిసరిగా పేర్కొనేలా ఆదేశించాలని కోరారు. అలాగే ఏ వాహనాలు ఏ స్థాయి ఇథనాల్ కలిగిన పెట్రోల్‌కు అనుకూలంగా ఉంటాయో తెలియజేసే అధికారిక డేటాబేస్ ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.

పిటిషన్‌లో ప్రధాన డిమాండ్లు

పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని వినియోగదారులకు వెల్లడించాలి

ఇంధన నాజిళ్లు, బిల్లులపై ఇథనాల్ మిశ్రమ వివరాలు ముద్రించాలి

వాహనాల మోడల్ ఆధారంగా E20 అనుకూలతపై అధికారిక సమాచారం అందించాలి

పాత వాహనాలకు E20 వల్ల ఎదురయ్యే సమస్యలపై రక్షణ చర్యలు తీసుకోవాలి

తాము కొనుగోలు చేసే ఇంధనం వివరాలు తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉందని పిటిషనర్ వాదన

ముఖ్యంగా 2023కి ముందు తయారైన వాహనాలకు 20 శాతం ఇథనాల్ కలిగిన E20 పెట్రోల్ వినియోగంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్యాక్ చేసిన ఆహార పదార్థాల మాదిరిగానే ఇంధనంలో ఉండే మిశ్రమాల వివరాలను కూడా వెల్లడించాలని పిటిషనర్ కోరారు.

కేంద్రం అభ్యంతరం

ఈ పిటిషన్‌ను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి వాదిస్తూ, ఇదే అంశానికి సంబంధించిన పిల్‌ను గతంలోనే సుప్రీంకోర్టు తిరస్కరించిందని గుర్తుచేశారు. ప్రస్తుత పిటిషన్‌ను 'ప్రాక్సీ పిటిషన్'గా ఆయన అభివర్ణించారు.

జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ ప్రసన్న బి. వరాళేలతో కూడిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. సంబంధిత హైకోర్టును ఆశ్రయించే అవకాశం పిటిషనర్‌కు ఉందని తెలిపింది.

ఇదిలా ఉండగా, E20 పెట్రోల్ వల్ల వాహనాల పనితీరులో మెరుగుదలతో పాటు ఉద్గారాలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ విధానం వల్ల రైతులకు కూడా ప్రయోజనం ఉంటుందని కేంద్రం పేర్కొంటోంది.

🏠 Home