🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 18 October 2026, 10:04 am Posted by : ARYADVI NEWS

SIR పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

News Image

ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిశీలించాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు దరఖాస్తుల్లో అసలు ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి

జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

ఖమ్మం అక్టోబర్-17:

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

శనివారం ఎస్‌ఐఆర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు/జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ (ఐడీఓసీ) నుంచి జిల్లా కలెక్టర్ దివాకర టీ ఎస్ సంబంధిత అధికారులతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న విచారణలను పూర్తి చేయాలని సూచించారు. అవసరమైన వారికి నోటీసులు జారీ చేసి, తదుపరి చర్యలను సకాలంలో చేపట్టాలని తెలిపారు.

ఓటర్లకు జారీ చేయాల్సిన పెండింగ్ నోటీసులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని, బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) ఓటర్ల ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేయడంతో పాటు, అవసరమైన ధ్రువీకరణ పత్రాలను వారి ఇళ్ల వద్దే స్వీకరించాలని సూచించారు. ఓటర్ల అర్హతలను నిర్ధారించే సమయంలో సంబంధిత పత్రాలను జాగ్రత్తగా పరిశీలించి, అర్హులైన ఓటర్ల వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా చూడాలని ఆదేశించారు.

ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు, అనర్హుల నమోదు, ద్వంద్వ నమోదులు లేకుండా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రతి బూత్ స్థాయి అధికారి తమ పరిధిలోని దరఖాస్తులు, ఓటర్ల వివరాలకు సంబంధించిన రికార్డులను భౌతిక పత్రాల రూపంలో సక్రమంగా నిర్వహించి, భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరచాలని సూచించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, దరఖాస్తుదారుల అసలు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను తనిఖీ చేసి అర్హతలను నిర్ధారించాలని సూచించారు.

నకిలీ, తప్పుడు, ద్వంద్వ దరఖాస్తులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇట్టి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ, జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో 5734 ఫారం-6 లు,394 ఫారం-7 లు, 6563 ఫారం-8 దరఖాస్తులు పెండింగులో ఉన్నట్లు, త్వరితగతిన పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

నోటీసుల జారీ, విచారణ, దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో శిక్షణా సహాయ కలెక్టర్ పారస్ కుమార్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, ఎస్డీసి సదానందం, కలెక్టరేట్ ఎలక్షన్ విభాగ పర్యవేక్షకులు ఎం. ఏ. రాజు, డిటి అన్సారీ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

🏠 Home