రహదారుల నిర్మాణానికి కృషి చేస్తున్న సర్పంచ్ కృష్ణ నాయక్
బోటికింది తండా నుంచి మల్సూర్ దర్గా వరకు రహదారి నిర్మాణానికి శంకుస్థాపన
నూతనకల్, అక్టోబర్ 18 ఆర్యాద్వి: గ్రామంలో అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు సర్పంచ్ గుగులోతు కృష్ణ నాయక్ తెలిపారు.
ఆదివారం మండల పరిధిలోని బోటికింది తండా పీడబ్ల్యూ రోడ్డు నుంచి మల్సూర్ దర్గా వరకు గ్రామపంచాయతీ నిధులతో నిర్మించనున్న రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దర్గా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దాదాపు 30 సంవత్సరాలుగా దర్గా అక్కడే ఉన్నప్పటికీ, రహదారి సౌకర్యం కల్పించడంపై గతంలో ఎవరూ దృష్టి సారించలేదని గ్రామస్థులు తెలిపారు. ప్రస్తుతం సర్పంచ్ గుగులోతు కృష్ణ నాయక్ చొరవతో దర్గా వరకు రహదారి నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.
అంతకుముందు తాళ్ల సింగారం నుంచి బోటికింది తండా వరకు రహదారి వెంట పెరిగిన కంపచెట్లు, పిచ్చిమొక్కలను తొలగించి రహదారిని శుభ్రం చేయించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.