🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 22 October 2026, 9:09 am Posted by : ARYADVI NEWS

అమరవీరుల త్యాగనిరతి ఫలితమే నేడు సమాజంలో కనిపిస్తున్న శాంతి, సౌభ్రాతృత్వం: జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్

News Image

ఖమ్మం ప్రతినిధి : అక్టోబర్, 21:

ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వర్తించిన పోలీసు అమరవీరుల త్యాగాల ఫలితమే నేడు సమాజంలో కనిపిస్తున్న శాంతి, సౌభ్రాతృత్వమని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా బుధవారం ఖమ్మం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., పోలీస్ కమిషనర్ సునీల్ దత్, జిల్లా పోలీస్ యంత్రాంగం, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొని స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.

తొలుత పోలీసు సాయుధ బలగాలు అమరవీరుల స్మృత్యర్థం పరేడ్ నిర్వహించి గార్డ్ ఆఫ్ హానర్ సమర్పించాయి. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అమరుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గార్డ్ ఆఫ్ హానర్ పరేడ్‌కు ఆర్‌ఐ శ్రీశైలం ఇన్‌చార్జిగా వ్యవహరించారు.

దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ఈ ఏడాది ప్రాణాలు కోల్పోయిన 155 మంది పోలీసు అమరవీరుల పేర్లను ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి చదివి వినిపించారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ శాలువాలతో సత్కరించి వారి త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ, దేశ రక్షణ కోసం సైన్యం, ప్రజా శ్రేయస్సు కోసం పోలీస్ శాఖ రోజువారీ విధుల్లో ప్రదర్శించే నిబద్ధత, అంకితభావం, త్యాగాలే సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు పునాది అని అన్నారు. జిల్లా పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో, ప్రగతికి తోడుగా కర్తవ్యం నిర్వహణలో ప్రజలకు రక్షణ, భద్రత, భరోసా కల్పిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.

విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి అండగా నిలుస్తూ, వారి బాధ్యతల నిర్వహణకు సహకరిస్తున్న పోలీసు కుటుంబ సభ్యుల సేవలు, వారి త్యాగాలను గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Article Photo

గతంతో పోలిస్తే నేరాల స్వరూపం గణనీయంగా మారిందని, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, ఇతర నూతన తరహా నేరాలు సమాజానికి సవాలుగా మారుతున్నాయని అన్నారు. ఇలాంటి నేరాలను సమర్థవంతంగా అరికట్టి ప్రజలకు భరోసా కల్పించే దిశగా దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అగ్రస్థానంలో నిలుస్తోందని పేర్కొన్నారు.

పోలీస్, పరిపాలనా విభాగాలు ఒకే నాణేనికి రెండు పార్శ్వాల వంటివని, ఇరు విభాగాలు పరస్పర సమన్వయంతో ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలను సాధించి రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రగతి పథంలో మరింత ముందుకు సాగుతుందన్నారు.

అమరవీరుల త్యాగాలు పోలీసు సిబ్బందికి స్ఫూర్తిదాయకం: సీపీ

అనంతరం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా బలగాల దాడిలో 10 మంది భారతీయ పోలీసులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. వారి అసమాన త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

సమాజ శ్రేయస్సు, దేశ రక్షణ, భావితరాల భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని, ఎక్కడ ఏ సంఘటన జరిగినా పోలీసులు తక్షణమే స్పందించి ప్రజలకు రక్షణ కల్పిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో గతంలో తీవ్రవాదం కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య జీవించాల్సిన పరిస్థితులు ఉండేవని అన్నారు. పోలీసు సిబ్బంది ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శాంతిభద్రతల పరిరక్షణకు చేసిన కృషి, త్యాగాల ఫలితంగా నేడు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. ప్రజల భద్రత, సమాజంలో శాంతి సామరస్యాల పరిరక్షణ కోసం పోలీసు అమరవీరులు చేసిన త్యాగాలను ఎప్పటికీ మరువకూడదని అన్నారు.

విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అమరవీరులు చూపిన ధైర్యం, అంకితభావం, కర్తవ్యనిష్ఠను ఆదర్శంగా తీసుకొని ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది ప్రజల భద్రత కోసం మరింత నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏఆర్ డీసీపీలు కుమారస్వామి, విజయబాబు, ఏఆర్ ఏసీపీలు సుశీల్ సింగ్, నర్సయ్య, ఏసీపీలు రమణమూర్తి, మహేష్, సాంబరాజు, నర్సింహారావు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు హేమనాధ్, పలువురు సీఐలు, ఆర్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

🏠 Home