🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 22 October 2026, 9:14 am Posted by : ARYADVI NEWS

అపూర్వ కలయిక.. ఆత్మీయ బంధాల వేదిక.

News Image

* ఖమ్మంలో ఘనంగా గడల వంశీయుల సమ్మేళనం.

* ప్రజాసేవలో రాణించేందుకు ఆశీర్వదించాలని డాక్టర్ గడల శ్రీనివాసరావు పిలుపు.

ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 21:

ఎక్కడా జరగని విధంగా రక్తసంబంధాలు, అనుబంధాలకు పెద్దపీట వేస్తూ గడల వంశీయులు, వారి ఆడబిడ్డల కుటుంబాల ఆత్మీయ కలయిక బుధవారం ఖమ్మంలో అత్యంత వైభవంగా జరిగింది. సుమారు 50 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న వంశీయులు, ఆడబిడ్డలు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ హెల్త్ డైరెక్టర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

గడల పెద్దల ఆలోచనలతో రూపుదిద్దుకున్న ఈ సమ్మేళనానికి కేవలం స్థానికులే కాకుండా ముంబై, హైదరాబాద్, బెంగుళూరు , చెన్నై వంటి సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన గడల వంశీయులు సైతం తరలివచ్చారు. దాదాపు ఏడు తరాల చరిత్ర కలిగిన గడల వంశం తమ మూలాలను మర్చిపోకుండా, భవిష్యత్ తరాలకు తమ బంధుత్వాలను పరిచయం చేసేలా ఈ వేడుకను నిర్వహించుకున్నారు. సాధారణంగా వంశ వృక్షం అంటే కేవలం మగవారి పేర్లతోనే ఉంటుందని, కానీ ఇంటికి దీపంలా వెలుగునిచ్చే ఆడబిడ్డలను, వారి కుటుంబాలను కలుపుకొని ఇలాంటి వేడుక నిర్వహించడం చరిత్రలో నిలిచిపోతుందని వక్తలు కొనియాడారు.

Article Photo

వేదికపై మాట్లాడిన వంశ పెద్దలు గడల వంశ మూలాలను, తరతరాల చరిత్రను సభికులకు వివరించారు. పూర్వం సుదూర గ్రామల నుంచి ఖమ్మంలోని కాల్వొడ్డు ప్రాంతానికి వలస వచ్చిన పెద్దలు ఎంతో కష్టపడి, ఐకమత్యంతో కుటుంబాన్ని వృద్ధిలోకి తెచ్చారని గుర్తుచేశారు. గడల ముత్తయ్య, గడల లక్ష్మయ్య, గడల రామలింగయ్య, గడల ఎల్లయ్య, గడల నరసయ్య వంటి పెద్దలు వేసిన బలమైన పునాదుల వల్లే నేడు గడల వంశం ఇంతటి స్థాయికి చేరుకుందని కొనియాడారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుగా ఒకే ఇంట్లో ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, నేడు కాలక్రమేణా ఉపాధి నిమిత్తం వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ, మళ్లీ అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి ఇలాంటి సమ్మేళనాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. నేటి యువతరం తమ పెద్దలను, రక్తసంబంధీకులను గుర్తుపట్టేందుకు ఈ వేదిక ఒక వారధిలా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ వంశం తరతరాలుగా సమాజ సేవలో ముందుందని గుర్తుచేశారు. 80 ఏళ్ల క్రితమే తమ పూర్వీకులు దేవాలయాల నిర్మాణానికి కృషి చేశారని, ముత్యాలమ్మ గుడి, శివాలయం, శ్రీరామనవమి ఉత్సవ కమిటీలలో గడల వంశీయుల పాత్ర మరువలేనిదని తెలిపారు. సమాజంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవడం తమ ఇంటి సంప్రదాయమని, కరోనా కష్టకాలంలో వేలాది మందికి వైద్య సహాయం అందించే అవకాశం ఆ భగవంతుడు తనకు కల్పించాడని పేర్కొన్నారు.

అనంతరం తన రాజకీయ ప్రస్థానం, భవిష్యత్ లక్ష్యాల గురించి గడల శ్రీనివాసరావు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రభుత్వ వైద్యుడిగా, ప్రజారోగ్య సంచాలకులుగా (హెల్త్ డైరెక్టర్‌గా) తన వంతు సేవలు అందించానని, అయితే సమాజంలో మార్పు తీసుకురావడానికి, పేద ప్రజలకు మరింత విస్తృతంగా సేవ చేయడానికి రాజకీయ వేదిక ఎంతో అవసరమని భావించి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టినట్లు తెలిపారు. రాజకీయాల్లో ఏ ఒక్కరినీ వ్యక్తిగతంగా విమర్శించే ఉద్దేశం తనకు లేదని, కేవలం నిర్మాణాత్మక, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్నదే తన అభిమతమని స్పష్టం చేశారు. సమాజ హితం కోరే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు తనను ఎంతగానో ఆకర్షించాయని అన్నారు.

పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన అపారమైన నమ్మకంతో ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే గొప్ప అవకాశాన్ని కల్పించారని శ్రీనివాసరావు సభాముఖంగా తెలిపారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ సువర్ణావకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని, ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉన్నత విద్యావంతులు, సేవాభావం కలిగిన వ్యక్తులు చట్టసభల్లోకి అడుగుపెట్టినప్పుడే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని, ఈ ప్రజా ప్రస్థానంలో తనను ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపించాలని సభికులను, ప్రజలను ఆత్మీయంగా కోరారు. ఇంటి బిడ్డగా తనకు కుటుంబ సభ్యులు, ఆడబిడ్డల అండదండలు ఎల్లప్పుడూ ఉండాలని, ఈ ఆత్మీయ కలయిక తనకు కొండంత బలాన్ని, నూతనోత్సాహాన్ని ఇచ్చిందని భావోద్వేగంగా మాట్లాడారు.

ఈ ఆత్మీయ సమ్మేళనం వేదికగా గడల శ్రీనివాసరావు మరో కీలక ప్రకటన చేశారు. గడల వంశీయులు, ఆడబిడ్డల కుటుంబాలలో ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునేందుకు 'గడల చారిటబుల్ ట్రస్ట్'ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తన తండ్రి గడల రామలింగయ్య జ్ఞాపకార్థం ఇప్పటికే జీఎస్ఆర్ (GSR) ట్రస్ట్ ద్వారా సేవలందిస్తున్నప్పటికీ, వంశీయుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఈ కొత్త ట్రస్ట్‌ను తీసుకొస్తున్నట్లు చెప్పారు. పేద పిల్లల చదువులు, అత్యవసర వైద్య ఖర్చులు, ఆడబిడ్డల పెళ్లిళ్లు, యువతకు ఉపాధి కల్పనలో ఈ ట్రస్ట్ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ట్రస్ట్ కోసం తన వంతుగా తక్షణమే రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఆర్థికంగా స్థితిమంతులైన వంశీయులు కూడా తమ వంతు సహకారం అందించి, కష్టాల్లో ఉన్న తోటి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ ఆత్మీయ కలయిక కేవలం ఒక్క రోజుకే పరిమితం కాకూడదని, ప్రతి ఏటా లేదా రెండేళ్లకోసారి క్రమం తప్పకుండా నిర్వహించుకుంటూ ఈ బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని వక్తలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఆటపాటలు, పాత జ్ఞాపకాల నెమరువేతలతో, కుటుంబ సభ్యుల ఆనంద భాష్పాలతో ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది. కార్యక్రమ నిర్వాహకులకు, వంటకాలు సిద్ధం చేసిన వారికి, వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికీ శ్రీనివాసరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

🏠 Home