ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 17:
పోలీస్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో శనివారం పోలీస్ పరేడ్ మైదానంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వేడుకల సందర్భంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆయన సతీమణి నిష్టాశర్మ గౌరమ్మకు పూజ చేసి ప్రారంభించారు. పోలీస్ కుటుంబాలు బతుకమ్మలను వివిధ రకాల పూలతో పేర్చి రంగు రంగుల బతుకమ్మలుగా సుందరంగా పేర్చారు. పెద్ద ఎత్తున బతుకమ్మలను మహిళలు తీసుకొచ్చి ఒకే చోట ఉంచి పాటలు పాడుతూ చప్పట్లను వేస్తూ, కోలాటాలు ఆడి ఆహ్లాదకర వాతావరణంలో ఆనందంగా జరుపుకున్నారు. మహిళలు అధిక సంఖ్యలో రావడంతో పరేడ్ గ్రౌండ్స్ కోలాహలంగా మారింది.

కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఏసీపీలు సుశీల్ సింగ్,నర్సయ్య, RI లు కామరాజు, శ్రీశైలం, సురేష్, నాగుల్ మీరా పాల్గొన్నారు.


