రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు
అక్టోబర్ నెలాఖరులోగా అన్ని ఇళ్ల స్లాబుల నిర్మాణం పూర్తి చేయాలి

ప్రతి మూడు రోజులకు పనుల పురోగతిపై నివేదిక సమర్పించాలి
నవంబర్ 8 నాటికి ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్ ప్యానెళ్ల ఏర్పాటు పూర్తి చేయాలి
డిసెంబర్ 9న ముఖ్యమంత్రి చేతుల మీదుగా వెలుగుమట్ల కాలనీ ప్రారంభోత్సవం
వెలుగుమట్ల కాలనీని పరిశీలించి మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి తుమ్మల
ఖమ్మం, అక్టోబర్- 19:
వెలుగుమట్ల కాలనీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు కాలనీలో చేపడుతున్న అన్ని మౌళిక వసతుల పనులను నవంబర్ 15వ తేదీ నాటికి నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
సోమవారం వెలుగుమట్ల కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్‌తో కలిసి మంత్రి పరిశీలించి, మీడియా సమావేశం నిర్వహించారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వెలుగుమట్ల కాలనీలో నిర్మాణం ప్రారంభించిన 300 ఇళ్లను నవంబర్ 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఇంటి నిర్మాణ స్థితిగతులు, ప్రస్తుతం జరుగుతున్న పనులు, పూర్తికావాల్సిన పనులు, పనుల పురోగతితో కూడిన నివేదికను ప్రత్యేకంగా సిద్ధం చేసి జిల్లా కలెక్టర్‌కు సమర్పించాలని సూచించారు.
ప్రతి రోజూ పనులను పర్యవేక్షిస్తూ, ప్రతి మూడు రోజులకు ఒకసారి పురోగతి నివేదికను కలెక్టర్‌కు అందించాలన్నారు.
అన్ని ఇళ్లను ఒకే నమూనాలో, ఆకర్షణీయంగా నిర్మించాలని, ఒకే రంగులో తీర్చిదిద్దాలని సూచించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి పగలు, రాత్రి పనులు కొనసాగించాలని ఆదేశించారు. అక్టోబర్ నెలాఖరులోగా అన్ని ఇళ్ల స్లాబుల నిర్మాణం పూర్తి చేయాలని, విద్యుత్ పనులను కూడా పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
కాలనీలో అన్ని మౌళిక వసతులు ఒకేసారి పూర్తి చేయాలి:
ఇళ్ల నిర్మాణంతోపాటు రహదారులు, డ్రైనేజీలు, ఎనిమిది దుకాణాలతో కూడిన షాపింగ్ కాంప్లెక్స్, బస్తీ దవాఖానా, కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ కేంద్రం తదితర మౌళిక వసతుల పనులను కూడా నవంబర్ 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
అన్ని పనులను సమాంతరంగా చేపట్టాలని, ఏ పనిలోనూ జాప్యం జరగకుండా చూడాలని పేర్కొన్నారు. కాలనీలోని ప్రతి ఇంటికి త్రాగునీటి పైపులైన్ ఏర్పాటు చేసి, ఇంటి వద్దనే త్రాగునీటి కుళాయి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కాలనీకి అవసరమైన రహదారులను నిర్మించాలని సూచించారు.
మున్సిపల్ కమీషనర్ ప్రతి మూడు రోజులకు ఒకసారి కాలనీని సందర్శించి పనుల నాణ్యత, పురోగతిని స్వయంగా పరిశీలించాలని ఆదేశించారు. అన్ని సౌకర్యాలతో వెలుగుమట్ల కాలనీని ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు.
దీపావళి నాటికి సోలార్ రూఫ్‌టాప్ ప్యానెళ్ల ఏర్పాటు:
కాలనీలోని ప్రతి ఇంటిపై సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి తెలిపారు. ఇందుకు అవసరమైన అనుమతులను ఇంధన శాఖ కార్యదర్శి ద్వారా పొందేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నవంబర్ 8వ తేదీ దీపావళి నాటికి సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు సంబంధించిన పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
డిసెంబర్ 9న ముఖ్యమంత్రి చేతుల మీదుగా కాలనీ ప్రారంభోత్సవం:
వెలుగుమట్ల కాలనీని డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. అప్పటికి కాలనీలోని అన్ని ఇళ్లు, రహదారులు, డ్రైనేజీలు, ఇతర మౌళిక వసతులు అందుబాటులోకి రావాలని స్పష్టం చేశారు. కాలనీకి సంబంధించిన పేరును ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటిస్తారని తెలిపారు.
గతంలో ఇక్కడ జరిగిన పరిణామాలను వివరిస్తూ, పేదల పేరుతో కొంతమంది భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించారని, కోర్టు నిర్ణయం ప్రకారం జిల్లా యంత్రాంగం ఆక్రమణలను తొలగించిందని మంత్రి పేర్కొన్నారు.
అదే ప్రాంతంలో మోసపోయిన పేదలకు శాశ్వత నివాసాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇందులో భాగంగా అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు వివరించారు.
పేదలకు న్యాయం చేస్తూ ఆదర్శ కాలనీగా, వెలుగుమట్ల కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కాలనీల్లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో, అలాంటి సదుపాయాలన్నింటినీ వెలుగుమట్లలోని పేదలకు ప్రభుత్వం కల్పిస్తుందని మంత్రి తెలిపారు.
ఇళ్లతోపాటు రహదారులు, డ్రైనేజీలు, బస్తీ దవాఖానా, అంగన్వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాల్, షాపింగ్ కాంప్లెక్స్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు.
పేదలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం వెలుగుమట్లలో ఆదర్శవంతమైన కాలనీని నిర్మిస్తోందని అన్నారు.
గతంలో జరిగిన దోపిడీని ప్రజలకు తెలియజేయడంతో పాటు, ప్రస్తుత ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాలు, వారికి కల్పిస్తున్న సదుపాయాలను కూడా ప్రజలకు స్పష్టంగా వివరించాలని మంత్రి సూచించారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ పాలనకు ప్రాధాన్యం:
తెలంగాణ రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు ఖర్చు చేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల స్థాయిపై ఆసక్తి వ్యక్తమవుతోందని, ఇటీవల తమిళనాడు పర్యటన సందర్భంగా అక్కడి వారు తెలంగాణలో ఇన్ని సంక్షేమ పథకాలను ఎలా అమలు చేయగలుగు తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు. పేదల సంక్షేమాన్ని ప్రధాన ఎజెండాగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, ప్రజాప్రతినిధులు రాయల నాగేశ్వరరావు, దీపక్ చౌదరి, కమర్తపు మురళి, కిషోర్, సాధు, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


