వైరా నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించాలి
కారేపల్లి, కామేపల్లి మండలాలకు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందించాలి.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయ పక్షపాతాన్ని విడనాడాలి
వైరా, అక్టోబర్ 17,
జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో ఏన్కూరు, కొణిజర్ల, వైరా మండలాలను చేర్చాలని సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైరా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి, రైతులు, పేదల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఇవి కూడా చదవండి
శనివారం వైరాలోని సీపీఐ(ఎం) డివిజన్ కార్యాలయం బోడేపూడి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భూక్యా వీరభద్రం, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, సుంకర సుధాకర్, సిపిఎం కొణిజర్ల మండల కార్యదర్శి చెరుకుపల్లి కుటుంబరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెనుకబడిన ఏజెన్సీ మండలమైన ఏన్కూరుతో పాటు కొణిజర్ల, వైరా మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఈ మండలాలను కరువు మండలాల జాబితాలో చేర్చి, రైతులకు నష్టపరిహారం, ఇతర కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.
వైరా నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, కారేపల్లి, కామేపల్లి, ఏన్కూరు మండలాలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన ప్రాంతాలకు సాగునీరు అందించకపోవడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సాగునీటి సౌకర్యాలు కల్పించినప్పుడే వ్యవసాయం అభివృద్ధి చెందడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు.
ఏన్కూర్ మండలం మూలపోచారం పంచాయతీ పరిధిలో పోడు భూముల పై హక్కు పత్రాలు కలిగిన గిరిజన రైతులు బ్యాంకులో తీసుకున్న పంట రుణాలు వెంటనే ప్రభుత్వం మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయ పక్షపాతాన్ని విడనాడాలి
నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అధికార పార్టీ రాజకీయ పక్షపాత ధోరణిని ప్రదర్శిస్తోందని వారు విమర్శించారు. అర్హులైన పేదలందరికీ ఎలాంటి రాజకీయ వివక్ష లేకుండా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించి, ఇళ్లులేని నిరుపేదలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఏన్కూరు మండలంలో ఆదివారం అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు విచ్చేస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు సంబంధిత మంత్రులు వైరా నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కూడా అవసరమైన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేసి, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
కరువు సమస్య పరిష్కారం, సాగునీటి సౌకర్యాల కల్పన, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో పారదర్శకత, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాలని సీపీఐ(ఎం) నాయకులు డిమాండ్ చేశారు.


